మైనర్ బాలికను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు..!
“ఇరుముడి” చిత్రంపై బాలల హక్కుల కమిషన్కు న్యాయవాది మహేష్ బాబు చోల్లేటి ఫిర్యాదు
మన తొలివెలుగు | ఎల్బీనగర్ :
తెలుగు చిత్రం ఇరుముడిలో మైనర్ బాలికను ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారంటూ తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (టీఎస్సీపీసీఆర్)కు జై లోక్ సత్తా (సోషల్ జస్టిస్ ఫోరం) ఫౌండర్ ప్రెసిడెంట్, న్యాయవాది మహేష్ బాబు చోల్లేటి ఫిర్యాదు చేశారు. సినిమాలోని ఓ సన్నివేశంలో ఒక పాత్రధారి మైనర్ బాలికను ఉద్దేశించి “ముదురు ముండ” అనే పదాన్ని ఉపయోగించినట్లు తన దృష్టికి వచ్చిందని మహేష్ బాబు చోల్లేటి ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నారులను ఉద్దేశించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం వారి గౌరవం, మనోభావాలు, హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలు సమాజంపై, ముఖ్యంగా పిల్లలు, యువతపై గణనీయమైన ప్రభావం చూపే ప్రజా మాధ్యమాలని పేర్కొన్న ఆయన మైనర్లను ఉద్దేశించి ఉపయోగించే సంభాషణలు, పదజాలంపై సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సన్నివేశం బాలల గౌరవం, హక్కులకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని బాలల హక్కుల కమిషన్ను కోరినట్లు తెలిపారు. ఇరుముడి చిత్ర బృందం పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై బాలల హక్కుల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బాలలపై ప్రభావం చూపే కంటెంట్ విషయంలో సంబంధిత నియంత్రణ సంస్థలు స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

