తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు
మన తొలివెలుగు భువనగిరి రూరల్ ప్రతినిధి కే. నాగమణి (30 జూలై 2026) :
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు, వ్యవసాయ కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో వచ్చే నెల 10న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరెట్ ముట్టడిలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. గురువారం పోచంపల్లి మండల కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సీఐటీయూ మండల కన్వీనర్ మంచాల మధు అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జైలుభరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథి నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ), అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్యూయూ) సంయుక్తంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆగస్టు 10న దేశవ్యాప్త నిరసనలను చేపట్టాలని నిర్ణయించాయని తెలిపారు. ప్రధానంగా కేంద్రంలోని మోడీ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కార్మికుల, కర్షకుల వ్యవసాయ కూలీల జీవనం మీద, వారి హక్కుల మీద దాడి చేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం పరిశ్రమల అధిపతులకు అనుగుణంగా నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచిందని, చట్టాలలో అనేక మార్పులు తెచ్చిందని దీనిని కార్మికులంతా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికులకు నెలకు రూ. 26,000 కనీస వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పీ) అమలు చేయాలని, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, విత్తన చట్టాన్ని, విద్యుత్తు సవరణ బిల్లును తక్షణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టంను ఎత్తివేసి తీసుకువచ్చిన వీబీ జీ రాంజీ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజువారీ కనీస వేతనంగా రూ.800 చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరంచేసే విధానాలను విరమించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు భూ పంపిణీ జరపాలని, ఇండ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. దేశ వ్యవసాయాన్ని దెబ్బతీసే విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, జాతీయ ఆహార భద్రత చట్ట సవరణను కూడా ప్రభుత్వం విరమించుకోవాలనే డిమాండ్ల సాధనకై నిర్వహిస్తున్న జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ్మ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ప్రసాదం విష్ణు, సీఐటీయూ పట్టణ కన్వీనర్ వడ్డేపల్లి యాదగిరి, ప్రజా సంఘాల నాయకులు గూడూరు రామ్ రెడ్డి, కలకొండ బాబు, కొట రమేష్, జంగారెడ్డి, జయమ్మ, జనార్దన్ రెడ్డి, శంకర్, స్వామి, ఇస్తారి, దశరత, నర్సింహ, శారద తదితరులు పాల్గొన్నారు.

