పాక్స్ (పీఏసీఎస్) నూతన పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
మన తొలివెలుగు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (29 జులై 2026) :
రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్ ) నూతన పాలకవర్గ సభ్యులకు సూచించారు. బుధవారం వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) నూతన పాలకవర్గ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఏసీఎస్ చైర్మన్గా గరిసె రవికి మండల ప్రజలు గొప్ప బాధ్యతను అప్పగించారని తెలిపారు. ప్రజలు, రైతులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పదవికి గౌరవం తీసుకొచ్చేలా నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పారదర్శకతతో, జవాబుదారీతనంతో సేవలందించాలని కోరారు. వలిగొండ మండల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో చేపడుతూ, భువనగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేగా వలిగొండ మండల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వంగా భావించేలా పనిచేస్తామని, కార్యకర్తల బలమే తమ బలమని స్పష్టం చేశారు. పీఏసీఎస్ చైర్మన్ శ్రీ గరిసె రవి మాట్లాడుతూ.. తమపై విశ్వాసం ఉంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. రైతులకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందిస్తూ సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులకు వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ భీమానాయక్, వలిగొండ గ్రామ సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, ఉపసర్పంచ్ మల్గ మాధవి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని సహాదేవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పద్మ అనంతరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సహకార సంఘ సభ్యులు, అధికారులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, రైతులు శుభాకాంక్షలు తెలిపారు.

