జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి టౌన్ ప్రతినిధి జంగిటి రవీందర్ :
మహిళా సంఘాల సభ్యులకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా వైద్య అధికారి మనోహర్, రాష్ట్ర స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 1,94,493 మంది స్వయం సహాయక మహిళా సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మహిళకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రక్తంలో చక్కెర పరీక్ష, సీరం బిలిరుబిన్, సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఎస్‌జీపీటీ, ఎస్జీఓటీ, సీరం ఆల్కలైన్ ఫాస్ఫటేస్, సీరం టోటల్ ప్రోటీన్, సీరం ఆల్బుమిన్ వంటి 10 బయోకెమిస్ట్రీ పరీక్షలు, థైరాయిడ్ పనితీరును అంచనా వేసే టీఎస్‌హెచ్ పరీక్షతో పాటు హీమోగ్లోబిన్, తెల్ల రక్తకణాల సంఖ్య, ప్లేట్లెట్ కౌంట్, ఎర్ర రక్తకణాల సంఖ్య తదితర 7 హీమటాలజీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదనంగా రక్తగ్రూప్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), రక్తపోటు, వైకల్య నిర్ధారణ, శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన రేటు, శ్వాస రేటు, కంటి పరీక్ష, నోటి పరీక్ష, చర్మం మరియు గోళ్ల పరీక్షలు వంటి 12 స్పోక్ స్థాయి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షల ద్వారా మహిళల్లో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న ల్యాబ్ మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, మానవ వనరులు, రీ-ఏజెంట్లు మరియు ఇతర అవసరమైన సామగ్రిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలు, నమూనాల సేకరణ, డేటా నమోదు, ఫాలోఅప్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు మేప్మా, మున్సిపల్ శాఖ మరియు డీఆర్డీఏ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పోచంపల్లి, షరాజీపేట్ మరియు బీబీనగర్ ను మాస్టర్ ట్రైనర్ కేంద్రాలుగా గుర్తించి, అక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ల ద్వారా మిగిలిన ఆరోగ్య సిబ్బందికి శిక్షణ అందించి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య స్థితిపై సమగ్ర ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించడంతో పాటు, వ్యాధులను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ద్వారా మహిళల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, డీసీహెచ్ఎస్, ఆర్‌ఎంఓలు, వైద్యులు, టీ-హబ్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

