మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, చిరు ఉద్యోగులపై తీవ్ర భారం పడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. అచ్చే దిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం, ఇప్పుడు అన్ని ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఒకవైపు ధరలు పెంచుతూ, మరోవైపు ప్రజలకు పొదుపు మంత్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వ అసలు వైఖరిని బయటపెట్టిదన్నారు. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

