మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఉస్మాన్ నగర్ , షాహిన్ నగర్ పరిసర ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. జల్ పల్లి సర్కిల్ డివిజన్ 64, పరిధిలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జల్ పల్లి సర్కిల్ ఉస్మాన్ నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లోపించి, మురుగునీరు రోడ్లపైనే కాకుండా నేరుగా స్థానికుల ఇళ్లు, కార్యాలయాల్లోకి చేరుతుండటంతో ప్రజలు నరకప్రాయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఈ తీవ్రమైన కష్టాలను ఎమ్మెల్యే స్వయంగా పర్యటించి, కళ్లారా చూసి తీవ్రంగా చలించారు.

ప్రజల ఇళ్లల్లోకి మురుగునీరు చేరుతుంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారని, స్పాట్ లోనే మున్సిపల్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా డ్రైనేజీ మెయింటినెన్స్ లోపించడం వల్ల కాలనీలు అపరిశుభ్రంగా మారాయని, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. సమస్య తీవ్రతపై ఎమ్మెల్యే వెంటనే స్పాట్ నుండే జోనల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఇళ్లల్లోకి మురుగు నీరు రావడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీనిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రూ. 84 కోట్ల జాతీయ రహదారి విస్తరణ గతంలో కేసీఆర్ హయాంలో చంద్రాయణగుట్ట నుండి తూక్కుగూడ వరకు నేషనల్ హైవే విస్తరణ కోసం పెట్టిన ప్రతిపాదనలు ఇప్పుడు రూ. 84 కోట్లతో శాంక్షన్ అయ్యాయన్నారు. 100 ఫీట్ల వెడల్పుతో 4 లైన్లు రోడ్డు విస్తరణ జరుగుతుంది అన్నారు. రాబోయే 10 రోజుల్లో టెండర్ వర్క్ స్టార్ట్ అవుతున్నందున, రోడ్డు పక్కన ఉన్న ఇండ్ల వారికి సరైన నష్టపరిహారం అందించి, ఈ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రజా పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు, మాజీ వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, మాజీ కౌన్సిలర్ షేక్ అప్జల్, నాయకులు సయ్యద్ హుస్సేన్, మన్సూర్ అలీ, ,బర్కత్ అలీ, ఆరిఫ్ అలీ, అబ్బాస్, మన్నన్, మగ్ధూమ్ పటేల్, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.

