మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాలనే లక్ష్యంతో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజలకు చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి గ్రామపంచాయతీ చెత్త సేకరణ వాహనానికి అందించాలని సూచించారు. తడి చెత్తలో మిగిలిన ఆహార పదార్థాలు, కూరగాయల వ్యర్థాలు, పండ్ల తొక్కలు, మాంసాహార వ్యర్థాలు ఉంచాలని, పొడి చెత్తలో ప్లాస్టిక్, కాగితాలు, అట్టపెట్టెలు, లోహపు వస్తువులు వేయాలని తెలిపారు. శానిటరీ చెత్తలో డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, న్యాప్‌కిన్లు, ప్రత్యేక హానికర చెత్తలో పెయింట్ డబ్బాలు, పురుగుమందుల డబ్బాలు, గడువు ముగిసిన మందులు, వాడిన సిరంజీలు, ఇతర రసాయన వ్యర్థాలను వేరు చేయాలని గ్రామస్తులకు వివరించారు. గతంలో ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంటికి అందజేసిన తడి, పొడి చెత్త డబ్బాలను వినియోగించి చెత్తను సక్రమంగా అందించాలని కోరారు. అలాగే గ్రామంలోని చెత్త సేకరణ బిన్‌లను సద్వినియోగం చేసుకుంటూ ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన గ్రామంగా తాజ్‌పూర్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సూచించిన విధంగా చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీకి సహకరించే కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు, ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్‌రావు, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబ్ యాకుబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, ఎఫ్‌ఏ రామస్వామి, ఆశ కార్యకర్త అరుణ, కారోబార్ సుగుణాకర్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

