ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణమసకబారుతున్న మల్ రెడ్డి ప్రతిష్ట..!

మసకబారుతున్న మల్ రెడ్డి ప్రతిష్ట..!

📰 Generate e-Paper Clip

పేదల పెన్నిధిగా పేరున్న రంగన్న

ఆయన పేరును అప్రతిష్ట పాలు చేస్తున్న మునుగనూరు చోట మోటా లీడర్లు..! 

వాళ్ల స్వార్థం కోసం.. ఎమ్మెల్యేను తప్పుదారి పట్టిస్తున్న వైనం

పేదలపై జులుం.. ఎంక్వయిరీల పేరుతో భయపెట్టే ప్రయత్నం

ఎమ్మెల్యే పేరు చెప్పి దండుకునే యత్నం

గత మునగనూరు గ్రామ మాజీ సర్పంచ్.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన  తాజా మాజీ కౌన్సిలర్ 

ఇప్పటికైనా ఈ కోవర్టులతో జాగ్రత్త సారు..!

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి :

పేదల పెన్నిధిగా పేరు ఉన్న ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రతిష్ఠ మసకబారుతుంది. అపూర్వ అనుభవం కలిగిన సీనియర్ ప్రజానాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి కొంతమంది స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మగా మారారా.. అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని చోటామోటా నాయకులు ఆయన చుట్టూ కోటరిగా చేరి తప్పుడు సమాచారం ఇస్తూ.. తమ స్వలాభం కోసం పేదలపైకి ఉసిగొల్పుతున్నట్లు సమాచారం. నిరంతరం పేదల పక్షాన ఉండే రంగన్నను కూడా తప్పుదోవ పట్టిస్తూ అప్రతిష్ట పాలు చేస్తున్నారు.

మల్ రెడ్డి రంగారెడ్డి సీనియర్ పొలిటిషన్. ఆయన రాజకీయ నాయకుడే కాదు.. అపూర్వ అనుభవం కలిగిన మహానేత. పేదల కోసం నిరంతరం ఆలోచించే మనస్తత్వం. అందుకే గతంలో ఉమ్మడి మలక్ పేట్ నియోజకవర్గం  నుండి కూడా ప్రజల ఆశీస్సులతో అత్యధిక మెజార్టీ సాధించి గెలుపొందారు. అనంతరం ఆయన పేరు మీద అనేకం మల్ రెడ్డి రంగారెడ్డి కాలనీలతో పాటు అనేక పేదల కాలనీలు ఏర్పడ్డాయి. అలా నిరంతరం పేదల కోసం ఆలోచించే రంగన్నను ప్రస్తుతం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కలుషితం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు స్వతహాగా నిర్ణయాలు తీసుకుని మల్ రెడ్డి రంగారెడ్డి ఇలాంటి నాయకుల ఉచ్చులో పడి తప్పటడుగులు వేస్తూ.. నిర్ణయాలు తీసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

రెక్కాడితే గాని.. డొక్కాడని బతుకులు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసారాంబాగ్ మూసి పరివాహక నది ఒడ్డున్న ఉన్న పేదల గుడిసెలను తొలగించి వారికి మునగనూరులోని జే.ఎన్.ఎన్ యు.ఆర్.ఎం ఇండ్లను కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉంది. దాదాపు గత ఏడేళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ కష్టార్జితంతో బతుకులు వెళ్లదీస్తున్న పేదల బతుకులపై కొంతమంది స్వార్థపరుల కన్ను పడింది. ఈ పేదలను భయపెట్టి, భయబ్రాంతులకు కురిచేసి సొమ్ము చేసుకోవాలని ఆశ పుట్టింది. తమ అంగబలం, ఆర్థిక బలంతో పాటు రాజకీయ బల ప్రదర్శనతో పేదలను భయపెట్టాలనుకున్నారు. అందుకోసం స్థానికంగా ఉండే లోఫర్ గాడి ( స్వామి) ని ఎంచుకున్నారు. అక్కడ నివసించే పేదల ఒక్కొక్క కుటుంబం నుంచి ₹ 20 నుంచి 30 వేల వరకు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో 20% లోఫర్ గాడికి ఇచ్చే విధంగా గత మునగనూరు మాజీ సర్పంచ్, ఇటీవలి  మాజీ కౌన్సిలర్ ఒప్పందం చేసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ పాచిక పారేందుకు ప్రతిసారి ఎమ్మెల్యేకు మునగనూరు జే.ఎన్.ఎన్. యు.ఆర్.ఎమ్ లో నివసిస్తున్న లబ్ధిదారుల విషయంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చెవులు కొరుకుతూ.. తమ పాచికలు పారే విధంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎక్కడా లేని సర్వే.. ఇక్కడే ఎందుకో..?

రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అనేక మంది పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చారు. అప్పటి నుండి పేదలే కూలీ నాలి చేసుకుని ఆ ఇండ్లలో తమ బతుకులను వెల్లదీస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చాలామంది పేదలకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించింది. కానీ ఇప్పటివరకు ఆ కేటాయించిన లబ్ధిదారుల విషయంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం గానీ, తర్వాతి కేసీఆర్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ.. ఇంతవరకు రీ ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవు. కానీ.. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మునగనూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న పేదలను రీ-ఎంక్వైరీ తో భయభ్రాంతులకు గురి చేయడం వెనక కారణమేంటనే.. ప్రశ్నలు ఇప్పుడు సర్వత్ర వెలువడుతున్నాయి. రోజు కూలి నాలి చేసుకునే పేదలు తమ కూలి డబ్బులను వదులుకొని గత నాలుగైదు రోజులుగా పస్తులు ఉంటూ.. ఎప్పుడు ఏ అధికారి ఎంక్వైరీ కి వచ్చి తమ ఇంటిని తమకు కాకుండా చేస్తాడో అని బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పేదల ఉసురు తీసే ఇలాంటి పాపిష్టి నాయకుల బతుకులు ఎప్పుడో ఒకప్పుడు బజారున పడే రోజులు వస్తాయని పేదలు శాపనార్ధాలు పెడుతున్నారు.

త్వరలో ఎమ్మెల్యే అప్రతిష్ట పాలు పార్ట్ – 2

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!