మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం మహేశ్వరం టౌన్‌లోని పీఎస్‌వై ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి, పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ అమరవీరులను తలచుకుంటూ లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పదేళ్లపాటు సమర్థవంతమైన పాలన అందించి రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపారని కొనియాడారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి వంటి అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు సాధించిన ప్రగతి, ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలు ఆయన దూరదృష్టి, నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, త్వరలో ప్రారంభమయ్యే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహేశ్వరం నియోజకవర్గ సత్తాను మరోసారి చాటాలని ఆమె పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ గులాబీ జెండాను విజయపథంలో నడిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

