ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డినీళ్ళమడుగు బ్రిడ్జి కాలువ.. డేంజర్..యమ డేంజర్..!

నీళ్ళమడుగు బ్రిడ్జి కాలువ.. డేంజర్..యమ డేంజర్..!

📰 Generate e-Paper Clip

బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడు..?

ప్రమాదకరంగా మారిన నీళ్ళమడుగు బ్రిడ్జి 

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి / మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

రహదారులు అభివృద్ధికి పట్టుగొమ్మలు అంటారు. అలాంటి రహదారి కల్వర్టు వద్ద పూర్తిగా పాడైపోయింది. పట్టణ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి రహదారి అధ్వానంగా మారింది. అడుగేస్తే మడుగే అనేంతలా పరిస్థితి తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్డుపై నీరు పారి అసలక్కడ రోడ్డు ఉందా అనిపిస్తుంది. రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై పాలకులు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిశాయి. గతంలో రోడ్ల మరమ్మతులకు వర్షాలు అడ్డుగా ఉన్నాయని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చిన బ్రిడ్జిని అభివృద్ధి పరచలేదు. ఇదంతా చూస్తే.. రోడ్డు కష్టాలు కొనసాగక తప్పవని ప్రజలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ పట్టణ జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న నీళ్లమడుగు బ్రిడ్జిపై పరిశీలనాత్మక కథనం ఇది.

(ఫైల్ ఫోటో )

యంజాల్ మున్సిపల్ తొర్రూరు డివిజన్ పరిధిలోని ఇంజాపూర్ తోర్రూర్ రహదారి నీళ్ళమడుగు బ్రిడ్జి కాలువ యమ డేంజర్ గా మారింది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుంచి నీరు వెళ్లి కోతకుగురై పెద్ద పెద్ద గుంతలుగా మారింది. బ్రిడ్జికి కల్వర్టు లేకపోవడంతో లారీలు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు గుంతల కారణంగా అదుపు తప్పితే కాలువలో పడి మృత్యువాత పడడం ఖాయం. గతంలో ఈ రహదారిలో పదుల సంఖ్యలో గుంతల్లో పడి ఇరుక్కుపోయాయి. జేసీబీ తీసుకొచ్చి వాహనాలను బయటికి లాగేవారు. ఇంజాపూర్ నుంచి తొర్రూరు వైపు, సంఘీ నగర్ వెళ్లే ప్రయాణికులు ఈ రహదారిలో ప్రయాణిస్తుంటారు. ఇదే దారిలో స్కూప్స్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉండడంతో పెద్ద పెద్ద వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ రహదారులో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎప్పుడో కట్టిన బ్రిడ్జి కుంగిపోయి ఉంది. ఎప్పుడు కూలిపోతుందో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఈ రహదారిలో ప్రయాణించే ప్రయాణికులు ప్రతిరోజు ఆందోళనకు గురవుతున్నారు.

2021 సంవత్సరంలో భారీ వర్షాల సమయంలో తొర్రూరు రాజీవ్ గృహకల్పకు చెందిన ఇద్దరు యువకులు ఇంజాపూర్ గ్రామం నుంచి తొర్రూరు వస్తున్న సమయంలో బ్రిడ్జి పైనుంచి ప్రయాణిస్తున్నారు. వరద దాటికి బైకుతో సహా ఇద్దరు యువకులు కొట్టుకుని పోయి మృత్యువాత పడ్డారు. రెండు రోజుల వరకు కూడా ఆ శవాన్ని బయటకు తీయలేని పరిస్థితి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 30 పైగా వాహనాలకు పైగా ఇరుక్కుపోయాయి. సుమారు 20 మంది వరకు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఏండ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఇంకెప్పుడు..? 

ఎన్నో ఏండ్లుగా ఈ రహదారులలో సమస్య నెలకొని ఉంది. ప్రతి యేడు వర్షాకాలంలో మూడు నెలలు రాకపోకల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంజాపూర్ , తొర్రూరు వాసులే కాకుండా, ఈ రహదారిలో ప్రయాణించే ఇతరులతో పాటు ఈ ప్రాంతంలో ప్రయాణించే వాహనదారుల్లో వణుకు పుడుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం పూర్తయ్యే వరకు 3 నెలలు ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. వర్షాకాలంలో కల్వర్టు ప్రాంతంలో రోడ్డు చెరువును తలపిస్తుంది. వానకాలంలో ఈ రహదారిలో నెల రోజుల రాకపోకలు ఆగిపోవాల్సిందే. ఈ దారిలో ప్రయాణించేవారు ఇంజాపూర్ నుంచి తొర్రూరు గ్రామానికి కేవలం 2 కిలోమీటర్లు ప్రయాణించాల్సింది పోయి ముంపు సమస్యతో మాసబ్ చెరువు కట్ట నుంచి రోడ్డు మీదుగా చుట్టు తిరిగి వెనక్కి వెళ్లి తొర్రూరు గ్రామానికి 6 కిలోమీటర్లు రాకపోకలు సాగించాలి. దీంతో అదనంగా 4 కిలోమీటర్లు ప్రయాణించడమే కాకుండా సమయం ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీళ్ల మడుగు బ్రిడ్జికి మోక్షం ఎప్పుడో..?

ఆగస్టు 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రూ. 3 కోట్ల వ్యయంతో రహదారిని, నీళ్ల మడుగు బ్రిడ్జిని అభివృద్ధి చేయాలని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ రహదారికి మోక్షం లభించలేదు. ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఓట్ల సమయంలో ఇది చేస్తాం.. అది చేస్తామని మాయమాటలు చెప్పి రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకుంటారు. గెలిచిన అనంతరం సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఈ రహదారిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నీళ్ల మడుగు బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలి 

బొక్క శ్రీనివాస్ రెడ్డి, ఇంజాపూర్ వాసి

ఇంజాపూర్ గ్రామం నుంచి తొర్రూర్ వెళ్లే రహదారి ఇటీవల నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల సమీపంలో నీళ్లమడుగు బ్రిడ్జి అధ్వానంగా మారడంతో, ఇంజాపూర్ నుంచి తొర్రూరు, బ్రాహ్మణపల్లికి రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో సుమారు 2 నెలల పాటు రోడ్డు మూసివేస్తారు. 2 కిలోమీటర్లు ప్రయాణించేది చుట్టూ తిరిగి 6 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. ప్రతిరోజు రాకపోకలు సాగించేవారు అదనంగా 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అధికారులు ఈ నీళ్ల మడుగు బ్రిడ్జిపై దృష్టి సారించి నూతనంగా బ్రిడ్జి ఏర్పాటు చేసి వాహనదారుల కష్టాలను తీర్చాలని కోరుతున్నాను.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!