ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకున్న యువత
అండగా నిలిచి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
ప్రశంసించిన గ్రామస్తులు
మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో / మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని దోని పాముల గ్రామంలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబానికి గ్రామ యువత మానవత్వంతో అండగా నిలిచారు. దోనిపాముల గ్రామంలో అన్నేపాక మహేందర్ తండ్రి బజారు ఇళ్ళు (గుడిసె) ఈనెల 6న కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చి గుడిసె మొత్తం కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ఈ ప్రమాదంలో వంట సామాగ్రి, బట్టలు, నిత్యావసర సరుకులు, పత్రాలు అన్నీ బూడిదయ్యాయి. కుటుంబం సభ్యులు కట్టుబట్టలతో నిరాశ్రుయులు అయ్యారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లింది.
యువత స్పందన:
సమాచారం అందుకున్న గ్రామ యువత వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయిన విషాదకర పరిస్థితిని గమనించిన యువత ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల గుడిసె కాదు. ఇల్లు అంటే ప్రేమానురాగాలు, ఆత్మీయతలు, అనుబంధాలు నివసించే ఒక పవిత్రమైన స్థలం. ఇల్లు మనకు భద్రతను, ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చే ఆశ్రయం. అలాంటి ఓ గుడిసె కాలిపోవడంతో యువత వెంటనే స్పందించారు. సోషల్ మీడియా ద్వారా గ్రామస్తులకు విషయం తెలిపి, తక్షణ నిధిని సేకరించారు. దోనిపాముల గ్రామ యువకులు తమ వంతుగా రూ. 17,000 వేలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అంతే కాకుండా కాలిపోయిన ఇంటికి పంచనామకు విచ్చేసిన కానిస్టేబుల్ దోనిపాముల వీపిఓ నగేష్ ఆ ఇంటిని చూసి చలించి రూ. 3000 వేలు తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.

గ్రామస్తుల ప్రశంసలు:
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం అంటే ఇదే.. అని గ్రామ పెద్దలు యువతను, పోలీస్ కానిస్టేబుల్ ని ప్రశంసించారు. ఆపత్కాలంలో తోటి మనిషికి అండగా నిలవడం ద్వారా మానవత్వం చాటుకున్న గ్రామ యువతను, పోలీస్ కానిస్టేబుల్ ని అభినందించారు. ఆ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

