ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఆగిపోయిన ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. 

ఆగిపోయిన ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను వేగవంతంగా వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్కేపురం డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో ఎస్‌ఎన్‌డీపీ నాలాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యవేషించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలా అభివృద్ధి పనులు ఎందుకు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల పనులు పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు.

ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మధ్యలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, వర్షాల సమయంలో నగరం మునిగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధి దృష్ట్యా మంచి ఆలోచనతో ఎస్‌ఎన్‌డీపీ నాలాల ప్రాజెక్టును ప్రారంభించారని, అయితే ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. దాదాపు రెండు సంవత్సరాలుగా పనులు కొనసాగుతున్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. అలాగే నగరంలో చెత్త సమస్య, తాగునీటి ఇబ్బందులు కూడా తీవ్రమవుతున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేసి చెత్త తొలగింపు, కాలువల శుభ్రత, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వర్షాకాలానికి ముందే అన్ని డ్రైనేజీ, నాలాల పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నగరంలోని మూడు కార్పొరేషన్లకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లోకసాని కొండల్ రెడ్డి, పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!