ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఆసిఫ్‌నగర్‌పై పరిపాలనా భారం తగ్గించాలి 

ఆసిఫ్‌నగర్‌పై పరిపాలనా భారం తగ్గించాలి 

📰 Generate e-Paper Clip

ఆసిఫ్‌నగర్‌ పరిధి విభజనకు డిమాండ్

నాంపల్లి పరిధి విస్తరణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

నాంపల్లి తహసీల్దార్ పరిధిని విస్తరించాలని ప్రజల వినతి

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి కనుగుల సాయి కిషోర్

హైదరాబాద్ జిల్లా పరిపాలన వ్యవస్థలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే తహసీల్దార్ కార్యాలయాల పరిధులను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఆర్‌డీవో హైదరాబాద్ డివిజన్‌కు వినతిపత్రం సమర్పిస్తూ, ప్రస్తుతం విస్తారమైన భౌగోళిక పరిధి మరియు అధిక జనాభాతో పనిచేస్తున్న ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయ పరిధిని తగ్గించి, నాంపల్లి తహసీల్దార్ పరిధిని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల వాదన ప్రకారం, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ పరిధిలో అనేక డివిజన్లు, దాదాపు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు ఉండటంతో పరిపాలన భారం అధికమైందని తెలిపారు. విస్తారమైన పరిధి కారణంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని, ముఖ్యంగా రెవెన్యూ సేవలు, ధ్రువపత్రాల జారీ, భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర ఆటంకాలు

ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత కూడా తీవ్రమైన సమస్యగా మారిందని పేర్కొన్నారు. రోజురోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నప్పటికీ, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు గంటల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజల వద్దకు సమర్థవంతంగా చేర్చడంలో కూడా పరిపాలనా ఒత్తిడి అడ్డంకిగా మారుతోందని తెలిపారు. ముఖ్యంగా పట్టణ పేదలు, వృద్ధులు, మహిళలు మరియు సాధారణ పౌరులు రెవెన్యూ సేవల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతిలో ప్రస్తావించారు.

గోషామహల్ నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణించాలని సూచన

ప్రజల ప్రతిపాదన ప్రకారం, గోషామహల్ నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా పరిగణిస్తూ, మంగళ్‌హాట్, దత్తాత్రేయనగర్ తదితర ప్రాంతాలను నాంపల్లి తహసీల్దార్ పరిధిలో చేర్చాలని కోరుతున్నారు. దీంతో పరిపాలనా విభజన సమతుల్యంగా మారి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

పరిపాలనా పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలన్న డిమాండ్

హైదరాబాద్ నగర జనాభా పెరుగుదలతో పాటు రెవెన్యూ సేవలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, తహసీల్దార్ కార్యాలయాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో సేవలు, వేగవంతమైన సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!