మన తొలివెలుగు, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్
గట్ల పంచాయతీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలోని మద్దెల బండ తండాలో చోటు చేసుకుంది. మద్దెల బండ తండాకు చెందిన చంద్రు నాయక్, బొడియ రాములు పొలాలు పక్క పక్కనే ఉన్నాయి. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా భూమి సరిహద్దుల విషయంలో తీవ్రస్థాయిలో గట్ల పంచాయతీ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ వివాదం కాస్త ముదరడంతో పాత కక్షలను మనసులో పెట్టుకున్న బొడియ రాములు చంద్రు నాయక్ ను హతమార్చినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య సమాచారం తెలిసిన వెంటనే తండావాసులు అక్కడికి చేరుకొని పోలీసులకు చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పాత కక్షలు కారణమై ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
