యాదగిరిగుట్ట బోర్డు నియామకంపై మండిపడ్డ బీఆర్‌ఎస్ నాయకులు
మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పని చేస్తూ తొత్తుగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నేబోయిన రమేష్ తీవ్రంగా విమర్శించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకమే ఇందుకు నిదర్శనమని వారు మండిపడ్డారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను, రైతుబంధు మాజీ అధ్యక్షుడు కొండా సోమళ్లుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా?” అని ముఖ్యమంత్రిని నిలదీశారు. మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా అడ్డుకున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకు పవిత్రమైన యాదగిరిగుట్ట బోర్డులో మెంబర్ పదవులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. “సొంత జిల్లాకు చెందిన మీ పార్టీ ఎమ్మెల్యేలకే తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఈ బోర్డు నియామకం జరిగిందంటే.. ఆ పదవులను ఎన్ని కోట్లకు అమ్ముకున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులకు, ఆంధ్ర నాయకులకు మన రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలకడానికి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలనే మోజుతో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తెలంగాణ సమాజం దీనిని అస్సలు సహించబోదని వారు హెచ్చరించారు.

