నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి భూమిని సేవకులకు అందించాలని గ్రామస్తుల వేడుకోలు
లీజు గడువు అయిపోయినా అదే దేవస్థాన భూమిలో అక్రమంగా మొక్కలు నాటుతున్న వైనం
ప్రశ్నించిన పేదలపై అధికార అండదండలతో అక్రమ కేసులా…?
మన తొలివెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
ధరూర్ మండలంలోని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూమిని గతంలో లీజు తీసుకున్న వ్యక్తుల నుండి భూమిని విడిపించి దేవస్థాన సేవకులకు, వ్యవసాయం చేసుకొనుటకు అందజేయాలని నాగర్ దొడ్డి గ్రామ ప్రజలు కోరుతున్నారు. నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూమి సర్వే నంబర్ 97 లో దాదాపు 43 ఎకరాలకు పైగా గతంలో 1991 నుండి 2011 వరకు నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి లీజుకు తీసుకున్న భూమిని ఇప్పటి వరకు దేవస్థానానికి సేవలు చేస్తున్న సేవకులకు అట్టి భూమిని విడవకుండా ఎండోమెంట్ భూమిపై పెత్తనం చెలాయిస్తూ దేవస్థాన సేవకులను మోసం చేస్తున్నారని నాగర్ దొడ్డి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లీజు గడువు అయిపోయినా లక్ష్మీరెడ్డి కుమారులైన వెంకట్రామి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులు వారసత్వం ప్రకారం అధికార బలంతో 97 సర్వేనెంబర్ లో దాదాపు 43 ఎకరాల వరకు పైగా ఉన్న నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి ఎండోమెంట్ భూమిలో లీజు గడువు అయిపోయి అదనంగా మరో 5 సంవత్సరాల గడువు తీరినా ఎండోమెంట్ దేవస్థానం భూమిని భాగాలుగా పంచుకొని మామిడి మొక్కలు నాటి దేవుడి భూమికే ఎసరు పెడుతున్నారని ఆరోపించారు.
వందల ఎకరాలకు పైగా ఉన్న దేవస్థాన భూమిపై కన్నేయడం విడ్డూరంగా ఉందని, ఇదే సమస్యపై ప్రశ్నించిన కింది కులస్థులు అనగా రజక, బోయ కులస్తులపై బెదిరింపులు చేసి దాడులకు పాల్పడడం అక్రమంగా కేసులు బనాయించడం హేయమైన చర్య అని నాగర్ దొడ్డి గ్రామస్తులు తెలిపారు.
ముంపు గ్రామమైన నాగర్ దొడ్డి గ్రామానికి ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఏర్పాటు కోసం రజకులు, బోయ కులస్తులు తమ ఆస్తులు సర్వం కోల్పోయామని అలాంటి మేము నారద గడ్డ చిన్న బసవేశ్వర స్వామి దేవస్థాన సేవకులుగా ఉన్న మాకు అట్టి భూమి సాగు చేసేందుకు హక్కు ఉందని, వందల ఎకరాలకుపైగా ఉన్న మీకు ఏ హక్కు ఉన్నదో చెప్పాలని ప్రశ్నిస్తే గతంలో దేవస్థాన భూమిని లీజుకు తీసుకున్న లక్ష్మీరెడ్డి కుమారులు మాపై అక్రమంగా కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది ఎంతవరకు న్యాయమని దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
97 సర్వే నంబర్లలో 43 ఎకరాలకు పైగా ఉన్న దేవస్థాన ఆలయ భూమి ఎండోమెంట్ కు సంబంధించినదని జిల్లా కలెక్టర్, ఎండోమెంట్ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నప్పటికీ, అట్టి భూమి యొక్క వివరాలు ఎండోమెంట్ శాఖ రికార్డులో ఉన్నా అక్రమంగా లీజు గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అదే స్థలంలో మామిడి మొక్కలు నాటడం అధికార అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతుందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎండోమెంట్ శాఖ అధికారులు చర్యలు తీసుకొని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థాన సేవకులకు న్యాయం చేసి పెత్తందారుల నుండి దేవస్థాన భూమిని విడిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

