మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపిస్తే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని’కి జాతీయ హోదా కల్పిస్తామని 2014 ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే నిలబెట్టుకోవాలని తెలంగాణ రక్షణ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ.. ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల సభలో నాటి ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. కానీ 12 ఏళ్లు గడుస్తున్నా ఆ మాటను నిలబెట్టుకునే దిశగా ప్రధానిగా ఆయన కనీస ప్రయత్నం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించి పార్లమెంట్ కు పంపినప్పటికీ, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం దారుణమన్నారు. దశాబ్దాలుగా వ్యవసాయంపై ఆధారపడి, సాంప్రదాయ పంటల కోసం పరితపిస్తున్న దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని ఇది తీవ్రంగా వంచించడమే అవుతుందన్నారు.
ఈ నెల 10వ తేదీన వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయడానికి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముందుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు . ఆ ప్రకటన చేసిన తర్వాతే ఆయన తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలన్నారు. నీటి పారుదల లేక ఇబ్బందులు పడుతున్న రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.

