నీటి, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు డిమాండ్
మన తొలితెలుగు, తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కానుగుల సాయి కిషోర్
ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బద్దం సతీష్ గౌడ్ తెలిపారు. పార్టీ అధికారంలోకి రాకముందు చేపట్టిన ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తీవ్రంగా వేధిస్తున్న మంచినీటి కొరత, తరచూ పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, వర్షాకాలంలో మరింత తీవ్రరూపం దాల్చే పారిశుద్ధ్య సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
గోషామహల్ నియోజకవర్గంలోని పాతబస్తీతో పాటు పలు డివిజన్లలో డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహం సక్రమంగా సాగడం లేదని, దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే డీసిల్టింగ్ (పూడికతీత) పనులను చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో నూతన డ్రైనేజీ లైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుత మంచినీటి సరఫరా వ్యవస్థ సరిపోవడం లేదని, అనేక కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. నీటి సరఫరాను మెరుగుపరచేందుకు కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాత లైన్లను మార్చాలని రెడ్ హిల్స్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. కేవలం మౌలిక వసతుల సమస్యలకే పరిమితం కాకుండా పరిపాలనా సౌలభ్యానికి సంబంధించిన అంశాలను కూడా కాంగ్రెస్ నాయకులు ప్రజావాణిలో ప్రస్తావించారు. గోషామహల్ నియోజకవర్గం ప్రస్తుతం వివిధ రెవెన్యూ పరిధుల్లో విభజించబడి ఉండటంతో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాన్ని ఒకే పరిపాలనా యూనిట్‌గా పరిగణిస్తూ నాంపల్లి తహసీల్దార్ పరిధిని విస్తరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో భాగంగా కొత్త పింఛన్ దరఖాస్తులను కూడా తహసీల్దార్ నయీముద్దీన్‌కు అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బద్దం సతీష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తోందన్నారు. ప్రజావాణి వంటి వేదికలను సమర్థవంతంగా వినియోగించుకుని గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షుడు ఇఫ్తేఖర్, బ్లాక్ అధ్యక్షుడు శామ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుభాష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫర్జానా, మాసూద్, ఆనంద్, శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

