పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలి
ఎంపీ ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం మహాధర్నా
జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపు
మన తొలివెలుగు, గోషామహల్ ప్రతినిధి సంకర్షణ :
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలో అమలైన విధానంలోనే కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో లక్డికాపూల్ లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అమలులోకి వచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరచకుండా గతంలో అమలైన విధానంలోనే కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్ లేదనే ప్రభుత్వ వాదనను ఖండించిన ఆయన, రాష్ట్రానికి తగిన ఆదాయ వనరులు ఉన్నప్పటికీ విద్యార్థుల విద్య కోసం అవసరమైన నిధులను కేటాయించకపోవడం బాధాకరమని విమర్శించారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, జీవో నంబర్లు 8, 9ను రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న విధానంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ట్యూషన్ సెంటర్లు, డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, సంబంధిత కార్యాలయాల వరకు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నాలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్, నీలం వెంకటేశ్, అంజి, అనంతయ్యతో పాటు పలువురు విద్యార్థి నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

