మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్
సర్.. ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి వెంకట్రామ్ తెలిపారు. సోమవారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రామ్ స్థానిక మాజీ కౌన్సిలర్ కే లక్ష్మీనారాయణతో కలిసి బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. జల్ పల్లి సర్కిల్ పరిధిలో మొత్తం 74 పోలింగ్ బూత్ లు ఉన్నాయని, బూత్ లకు సంబంధించి 8 మంది సూపర్వైజర్లు, 74మంది బీఎల్ఓలు ఉన్నారని అన్నారు. ప్రతి బీఎల్ఓకి వెయ్యి మంది ఓటర్లను కేటాయించామని, ప్రతి బీఎల్ఓ రోజుకి వంద మంది ఓటర్లను సంప్రదించి, ప్రతి ఓటరుకు రెండేసి ఎన్యుమరేషన్ పత్రాలను అందజేసి, వివరాలు ఎలా నమోదు చేయాలో ఓటర్లకి వివరించాలని తెలిపారు. పూర్తయిన పత్రాలలో ఒకటి తీసుకొని, రెండో దాన్ని రసీదుగా ఓటర్లకు అందజేయాలన్నారు. జల్ పల్లిలో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను జూలై 24 వరకు విజయవంతంగా పూర్తి చేయాలని బీఎల్ఓలను కోరారు. ఎన్యుమరేషన్ పత్రాలు తీసుకున్న ప్రతి ఓటరు జూలై 24వ తేదీలోపు పూర్తి వివరాలు నింపి బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే సర్ ప్రక్రియ విజయవంతంగా ముగుస్తుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరీ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు, సర్కిల్ సిబ్బంది సూపర్వైజర్ కుమార్, స్థానికులు శ్రీకాంత్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

