91 మందికి కంటి పరీక్షలు 37 మందికి ఆపరేషన్ కు అంబులెన్స్ లో తరలింపు
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ శిబిరమును పాత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. కంటి గాయాల వలన, వయసు రీత్యా కంటి శుక్లాలు ఏర్పడతాయని డా.రవికుమార్ అన్నారు. ముఖ్యంగా వృద్ధులలో కంటిలో శుక్లాలు ఏర్పడడం వల్ల తాత్కాలిక అందత్వం కలుగుతుంది. ఇది కేవలం శస్త్ర చికిత్స నిర్వహించి ఐ.ఓ.ఎల్.ను అమర్చడం ద్వారా చాలా సులభంగా సరి చేయవచ్చని తెలియజేశారు. క్షేత్రిస్థాయిలోని సిబ్బంది కంటిలో శుక్లాలు గల అనుమానితులందరినీ జిల్లాలో డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసే కంటి పరీక్ష శిబిరానికి తరలించాలని ఏఎన్ఎం లకు, ఆశా కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన కంటి పరీక్షా శిబిరంలో 91మందిని పరీక్షించి అర్హులైన 37 మందికి ప్రాథమికంగా రక్త పోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి మహబూబ్ నగర్ లోని ఎనుగొండలో గల లయన్ రాంరెడ్డి కంటి హాస్పిటల్ కు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా పంపించారు. ఈ కార్యక్రమంలో ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ, హెల్త్ ఎడ్యుకేటర్ నర్సింహా ఆరోగ్య సిబ్బంది వై.శ్రీనివాసులు, సుకుమార్ రెడ్డి, చెన్న కేశవులు తదితరులు పాల్గొన్నారు.
