ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్పారిశుధ్య కార్మికులపై సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ జులుం

పారిశుధ్య కార్మికులపై సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ జులుం

📰 Generate e-Paper Clip

కార్మికుల ఆందోళన

అపురూప కాలనీలో నిలిచిన పారిశుధ్య సేవలు

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ, ఎస్ఆర్ నాయక్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య సేవలు పూర్తిగా స్తంభించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పారిశుద్ధ్య ఎస్ఎఫ్ఎ ( సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్) మొగులయ్య వ్యవహార శైలికి నిరసనగా పారిశుధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన ఎస్ఎఫ్ఎ మొగులయ్య గత కొంతకాలంగా పారిశుధ్య కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు గుబ్బల లక్ష్మీనారాయణ, ఎస్ ఆర్ నాయక్ నగర్ మాజీ అధ్యక్షుడు ఆలూరి వెంకట శేషాచారి దృష్టికి కార్మికులు తీసుకెళ్లినట్లు తెలిసింది. గత శనివారం ఉదయం విధులకు వచ్చిన 9 మంది పారిశుధ్య కార్మికులు కేవలం ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే కారణంతో సూపర్వైజర్ మొగులయ్య వారికి హాజరు నమోదు చేయకుండా ఇంటికి పంపించినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో అపురూప కాలనీతో పాటు ఎస్ ఆర్ నాయక్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో చెత్త సేకరణ, వీధుల పరిశుభ్రత పనులు జరగక కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య పనులు నిలిచిపోవడం ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు, హాజరు నమోదు చేయాలంటే నెలనెలా మామూలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఎ కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై లక్ష్మీనారాయణ, వెంకట శేషాచారి, పి.వి. భాస్కర్ రెడ్డి కలిసి జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి, పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని, ఎస్ఎఫ్ఎ వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే సంబంధిత సూపర్వైజర్ ను మార్చి, పారిశుధ్య సేవలు సజావుగా కొనసాగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!