మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మేకం గుట్ట భూముల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రైతులకు అండగా ఉంటానని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం రావిర్యాల, కొంగర ఖుర్దు-ఏ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 289లో ఉన్న మేకం గుట్ట భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సరైన పరిహారం అందించాలని రైతులు మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కోరారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన మాట్లాడుతూ భూముల విలువలు పెరిగిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి న్యాయమైన పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు తమ భూములకు తగిన విలువ ఇవ్వకుండా నష్టపోకుండా చూడాలని విజ్ఞప్తి చేయగా, లక్ష్మారెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం ఈ నెలాఖరులో భూముల విలువలను పెంచే ప్రక్రియలో ఉందని తెలిపారు. ధరలు పెరిగిన తర్వాత అధికారులతో చర్చించి, రైతులకు అందరూ మెచ్చే విధంగా పరిహారం అందేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.“రైతులు అధైర్యపడొద్దు. ఎలాంటి తొందరపాటు అవసరం లేదు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తోంది. భూముల ధరలు పెరిగిన వెంటనే మీకు మరింత మెరుగైన పరిహారం వచ్చేలా నేను స్వయంగా అధికారులతో మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు. మేకం గుట్ట భూముల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అండగా ఉంటానని, వారి హక్కుల కోసం ఎప్పటికప్పుడు పోరాడుతానని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రావిర్యాల జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ చైర్మన్ కోటగళ్ల రంజిత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కొంగరి యాదయ్య, ఆలేటి శ్రీనివాస్, రైతులు దయానంద్, వెంకటేష్, చంద్రయ్య, నర్సింహా, రాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

