అర్హులైన ప్రతి ఒక్క ఓటు పరిరక్షణే లక్ష్యం
కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలి – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
మహేశ్వరం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్క ఓటు పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా కాంగ్రేస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రేస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు తుక్కుగూడలోని ఎస్ఎస్ఆర్ గార్డెన్స్‌లో నియోజకవర్గానికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గ ఎస్ఐఆర్ మాస్టర్ ట్రైనర్, విజయ డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్ల పేర్లు పెద్దఎత్తున తొలగించబడిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే పార్టీకి, ప్రజాస్వామ్యానికి నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎదురయ్యే అంశాలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వివరంగా వివరిస్తూ, బీఎల్ఓలు, బీఎల్ఏలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఇంటింటి సర్వే సమయంలో ప్రజలతో మమేకమై వారి వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు జరిగేలా చూడాలని సూచించారు. అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ.. కాంగ్రేస్ పార్టీపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, సమర్థత సాధించడంలో బీఎల్ఏల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించడం, కొత్త ఓటర్లను నమోదు చేయించడం, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా చూడడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు, లోపాలు లేదా అభ్యంతరకర అంశాలు గమనించినా వెంటనే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. అవసరమైతే అప్పీల్ ప్రక్రియ ద్వారా న్యాయం సాధించే అవకాశాలు ఉన్నందున ప్రతి అంశాన్ని బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు. శిక్షణా కార్యక్రమంలో ఓటర్ల జాబితా పరిశీలన, సవరణల విధానం, ఇంటింటి సందర్శన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం, ఎన్నికల సంఘం నిబంధనలు, అభ్యంతరాల పరిష్కార విధానం తదితర అంశాలపై గుత్తా అమిత్ రెడ్డి బీఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో టియుఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి యేల్మేటీ అమరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ గజ్జల రామచంద్ర , సీనియర్ నాయకులు వంగేటి మధుసూదన్ రెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ రావుల లింగం, జల్ పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అహ్మద్ బామ్, ఎంఎంసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ మైత్రి ఆనంద్, సీనియర్ నాయకులు గిరి నాయక్, మదారి భాస్కర్, మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి తుక్కుగూడ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలి :
నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలు, సందేహాలు లేదా అభ్యంతరాలు ఉన్నా వెంటనే తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కేఎల్ఆర్ సూచించారు. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సభ్యులు, బాధ్యులు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తారని తెలిపారు.

