ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డినాదర్ గుల్ లో పార్క్ స్థలం కబ్జా..!

నాదర్ గుల్ లో పార్క్ స్థలం కబ్జా..!

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జీహెచ్ఎంసీ బడంగ్ పేట్ డివిజన్ ప్రాంతాల్లో కోట్ల విలువైన పార్క్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. రియల్టర్లు, భూ బకాసురులు నకిలీ పత్రాలతో పార్కులను కబ్జా చేస్తుంటే, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కుల పరిరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తాం.. అంటూ నిత్యం ప్రకటనలు జారీ చేసే.. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు.. ఆచరణలో మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాదర్ గూల్ లో…

భూముల ధరలు ఎకరా రూ. కోట్లలో పలుకుతుండడంతో రియల్టర్లు, భూ బకాసురులు ప్రభుత్వ స్థలాలు, పార్కులను మాయం చేస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహకారంతో లే అవుట్లో పార్క్ స్థలాలు, స్కూళ్ల కోసం కేటాయించిన భూములను రిజిస్ట్రేషన్లు చేయించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల అండదండలతో అక్రమంగా గృహ నిర్మాణాలు చేపడుతున్నారనే టాక్ వినబడుతుంది. వీరి ఆగడాలపై కాలనీవాసులు, ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్ 16, డివిజన్ 57 లో నాదర్ గుల్ లో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ పార్క్ స్థలాలు కాపాడాలని కోరుతూ బడంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యకు స్థానిక బీజేపీ నేత రామిడి శూరకర్ణ రెడ్డి వినతిపత్రం అందజేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ సర్కిల్ నాదర్ గూల్ డివిజన్ అల్మాస్ గూడ గ్రామంలోని సర్వే నెంబర్ 31, 32, 33, 34 లలో పార్కు స్థలం కబ్జాకు గురైతుందని పేర్కొన్నారు. రామిడి కళావతి కాలనీకి సంబంధించి 294 గజాల పార్కు స్థలంలో ఇప్పటికే చదును చేసి రాత్రికి రాత్రే ప్రహరీ గోడను నిర్మించారని, అలాగే బీఎస్ఆర్ నగర్ కాలనీలోని 1001 గజాల పార్కు స్థలంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దాదాపు 1295 గజాల విలు వైన స్థలం అక్రమార్కుల కబంధ హస్తాల చేతిలోకి వెళ్లక ముందే కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాత్రికి రాత్రే పార్క్ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసి కబ్జాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కబ్జా నుంచి పార్కులను రక్షించాలి- స్థానిక బీజేపీ నేత రామిడి శూరకర్ణారెడ్డి

నాదర్ గుల్  57వ డివిజన్, అల్మాస్ గూడా పరిధిలోని సర్వే నెం. 31, 32, 33, 34 రామిడి కళావతి కాలనీ లోని (294 గజాలు), కబ్జా చేసి పురాతనమైన చింత చెట్టును కూడా కొట్టేసి చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. గతంలో వెంచర్ వేసినప్పుడు ఈ స్థలంలో బావి ఉంది. బావి స్థలాన్ని పూడ్చి పార్కుగా చూయించి అక్కడ ఉన్న ప్లాట్లు అమ్మివేయడం జరిగింది. పార్కు స్థలాన్ని పట్టాదారులు ప్రస్తుతం కబ్జా చేస్తున్నారు. బీఎస్ఆర్ కాలనీ (1001 గజాలు) ప్రభుత్వ శ్మశానవాటికకు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్నే వెంచర్ వేసినప్పుడు పార్కుగా చూపించడం జరిగింది. దీనిని కూడా అమ్మివేయడం జరిగింది. (2 పార్కులు కలిసి మొత్తం 1295 గజాలు, సుమారు దీని విలువ రూ. 6 కోట్ల ఉంటుంది. కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారులు పార్కులను, ప్రభుత్వ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని, ప్రహరీగోడ నిర్మించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!